ప్రపంచ వాణిజ్యంలో 12శాతం సరుకు రవాణా సూయెజ్ కెనాల్‌ ద్వారానే జరుగుతోంది. మంగళవారం ఉదయం చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్తున్న ఒక కార్గో నౌక కాలువలో ఇసుకలో చిక్కుకున్న సంగతి పాఠకులకు విదితమే! దాన్ని తిరిగి సరైన మార్గంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా కూడా ఇంతవరకు ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ తరుణంలో మరికొన్ని రోజులు ఆ నౌక అక్కడే అలాగే ఉంటే అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాలువలో ఈ నౌక ఇరుక్కుపోవడంతో ఆ దారిలో చాలా నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నౌకను మళ్లీ జలమార్గంలోకి మళ్లించాలంటే మూడు విధానాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏమిటవి?

మొదటిది: టగ్ బోటులతో లాగి నౌకను ముందున్నట్టుగా యధాతధంగా కాలువకు సమానం చేస్తారు. ప్రస్తుతం 9 టాగ్లు ఈ నౌకను సమాంతరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

రెండవది: ఇసుక తవ్వడం ద్వారా నౌకను దారికి తేవాలనుకుంటున్నారు. ఇప్పటికే నౌక చుట్టూ ఉన్న ఇసుకను తవ్వే ప్రయత్నం మొదలయ్యింది.

మూడవది: కార్గో లోని బరువుని తగ్గించడం. అంటే కార్గోలో ఉన్న ఇంధనాన్ని, కంటైనర్లను తొలగిస్తారు.

అయితే ఈ మూడు ప్రయత్నాల్లోనూ కూడా కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా అన్ని ప్రయత్నాలు ఒకేసారి చేయకుండా అంచెలంచెలుగా చేయాలనీ నిర్ణయించారు. బరువు తగ్గించే క్రమంలో షిప్ ఒకపక్కకి పడిపోయే ప్రమాదం ఉందని, ఇది చాల సున్నితంగా చేయవలసిన పని అని నిపుణులు వివరిస్తున్నారు.