కర్ణాటకకు చెందిన ఓ 73 ఏళ్ళ వృద్ధురాలు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేసి పదవీవిరమణ చేశారు. ఆమె తనకు ఒక తోడు కావాలని ఇచ్చిన ప్రకటన చూసి నెటిజన్ల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. గతంలో వివాహమైనా అతడి నుంచి విడాకులు తీసుకోవడంతో ‘నాకు కుటుంబం లేదు. నా తల్లిదండ్రులు చనిపోయారు. నా తొలి వివాహం విడాకులతో ముగిసింది. నేను ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నాను. ఇంట్లో పడిపోతే సాయం చేసేవారు ఉండరనే ఆలోచన వస్తోంది. బస్టాప్ నుంచి ఇంటికి నడవాలంటే భయమేస్తోంది. ఇలాంటి ఆలోచనలు జీవిత భాగస్వామి కోసం చూసేలా చేస్తున్నాయి’ అని, జీవిత చరమాంకం వరకూ తనతో కలిసి ఉండే ఓ తోడు కావాలని అన్నారు. తనకు ఓ వరుడు కావాలని, ఆరోగ్యవంతుడు, తన కన్నా వయసులో పెద్దవాడు, తప్పనిసరిగా బ్రాహ్మణుడు అయి ఉండాలని ఆమె తన భావాలు వ్యక్తం చేసారు. వృద్ధుల పట్ల నిరాదరణ చూపుతున్న సమాజానికి ఇదో మేలుకొలుపు అని ఆ ప్రకటన చుసిన యువత అంటున్నారు.