ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

నేడు ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం..!!

ప్రస్తుతం పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు, ఉద్యోగంలో ఒత్తిళ్లు, మానసిక ఒత్తిళ్లు, నిద్రలేనితనం వంటి కారణాలతో మనిషి ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నాడు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగినది హెపటైటీస్ వ్యాధి. ఇది చాలా ప్రమాదకరమైనది. శరీరంలోని కాలేయం (లివర్‌)పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏ,బి,సి,డి,ఇలు వెలుగు చూసిన ఈ వ్యాధిలో హెపటైటీస్ వ్యాధి చాలా ప్రమాదకరమైనదని, ఈ వ్యాధి తీవ్రత సిర్రోలిక్ దశకు చేరుకుని ఏకంగా కాలేయం పూర్తిగా దెబ్బతింటుందని, ఈ దశలో కాలేయం మార్పిడి చేయాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వ్యాధి బారినపడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

అందుకే ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతియేటా జూలై 28న ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

దేశ వ్యాప్తంగా ప్రతియేటా హెపటైటీస్ వ్యాధిగ్రస్థులు పెరిగిపోతున్నారు ఎందుకంటే పలు ప్రాంతాల్లో అపరిశుభ్రమైన వాతావరణం, కలుషితమైన నీటి కారణంగా ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. అధికంగా మురికివాడల్లోనూ ఈ హెపటైటీస్ -బి నమోదవుతోంది. ఈ వ్యాధి పై అవగాహన కల్పించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం వైద్య ఆరోగ్యశాఖపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ హెపటైటీస్ వ్యాధిని ప్రాథమిక దశలో ఉండగానే గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బాధితుడిని కాపాడవచ్చు. ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక టీకా కూడా అందుబాటులో ఉంది. దీని ధర మార్కెట్లో అధికంగా ఉండటంతో పేదలకు ఇబ్బందిగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ టీకా అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.

ఈ వ్యాధి అధికంగా మద్యం సేవించే వారికి వస్తున్నట్లు, శరీరంలో చేరే మద్యాన్ని విసర్జించే క్రమంలో కాలేయం ఎక్కువగా శ్రమకు గురవుతుందని, కాలేయం సామర్థ్యానికి మించి మద్యం సేవించినట్లయితే కాలేయ మెల్లమెల్లగా దెబ్బతింటుందని, ఫలితంగా ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ డిసీజ్‌, ఆల్కహాలిక్ హెపటైటీస్ ఆల్కహాలిక్ సిర్రోసిస్ వ్యాధులు దరిచేరుతాయని నిపుణులు చెప్తున్నారు. ఆల్కహాలిక్ ఫ్యాటి లివర్ డిసీజ్‌లో కాలేయం కణాల్లో కొవ్వు పేరుకుపోయి కాలేయం పనితీరు సక్రమంగా ఉన్నా ఎంజైమ్ విడుదలలో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఈ పరిస్థితిని నివారించాలంటే మద్యం మానేయాలి. అతిగా మద్యం సేవించే వారి కాలేయం వాపునకు గురై గట్టిగా తయారవుతుంది. దీనినే ఆల్కహాలిక్ హెపటైటీస్ అంటారు.

ఈ వ్యాధితో కాలేయం పనితీరు క్రమంగా అదుపు తప్పుతుంది. వ్యాధి తీవ్రత పెరిగితే కాలేయం విఫలమవుతుంది. హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి, వైరస్‌ల వల్ల కాలేయం కేన్సర్‌కు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యాధి లక్షణాలు: కామెర్లు, రక్తం వాంతులు,
పగలు నిద్ర, రాత్రుల్లో మెలకువగా ఉండడం
విరోచనాలు, అలసట ఎక్కువగా ఉండటం
నల్లరంగులో విరోచనాలు
జ్వరం
కడుపు నొప్పి
ఆకలి లేకపోవడం
క్రమ క్రమంగా బరువు తగ్గిపోవడం
కండరాలు, కీళ్ల నొప్పులు అధికంగా ఉండటం
కాళ్లు, పొట్టవాపు
చర్మం, కళ్లు పచ్చగా మారడం

చికిత్స : హెపటైటీస్ టీకా వేయించుకోవాలి.
వ్యాధిగ్రస్థుడు ప్రతియేటా వైద్య పరక్షలు చేయించుకోవాలి
వారానికి ఒక ఇంట్రఫిరాన్ ఇంజక్షన్ వేసుకోవాలి.
అతి ఖర్చుతో కూడినది కారణంగా మాత్రల ద్వారా నియంత్రణ చేయవచ్చు.
వ్యాధి నివారణకు శాశ్వత చికిత్స లేదు
అప్రమత్తంగా ఉండాలి

హెపటైటీస్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాధిరాకముందే టీకా వేసుకుంటే వ్యాధి వచ్చే అవకాశం ఉండదు. ఒక వేళ వ్యాధి ముదిరినట్లయితే కాలేయం మార్పిడి తప్ప వేరే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా చిన్నారులకు ఈ వ్యాక్సిన్ వేస్తున్నారు. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా అందుబాటులో ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •