జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

రైలులో చోరీ జరిగితే రైల్వే నే బాధ్యత వహించాలి!!

రైలులో నిత్యం దొంగతనాలు జరిగాయని వింటూనే ఉంటాము. అయితే పోగొట్టుకున్న వస్తువులు విలువైనవి కాకపోతే పోనీలెన్ని వదిలేస్తాము. కానీ ఖరీదైన వస్తువులు, డబ్బులు పోతే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తాం. అయితే పోగొట్టుకున్న వస్తువులు వెనక్కి రప్పించడం ఎలానో మీకు తెలుసా?? అసలు పోయిన వస్తువులకు రైల్వే శాఖే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఓ కేసులో కోర్టు సైతం అదే తీర్పునిచ్చి ప్రయాణికురాలికి భారీ మొత్తంలో పరిహారం ఇప్పించింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం!

హైదరాబాద్ నగరానికి చెందిన శీతల్‌ ముఖర్జీ బెంగళూరులో ఉంటున్న తన ఆడపడుచు నిశ్చితార్థానికి బంధువులతో కలిసి వెళ్లేందుకు 2017 ఆగస్టు 11న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-9 స్లీపర్‌ కోచ్‌లో 57, 58, 60, 62, 64, 69 బెర్త్‌లను రిజర్వ్‌ చేసుకుని, నిశ్చితార్థానికి అవసరమైన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌, నగలు, రూ.3 లక్షలు సూట్‌కేసులో భద్రపరిచి తీసుకెళ్లారు. ఆ తర్వాతి రోజు బెంగళూరులో రైలు దిగి ఆడపడచు ఇంటికి వెళ్లి చూడగా సూట్‌కేసు కింది భాగానికి కన్నం వేసిన దుండగులు.. రూ.14.01లక్షలు విలువ చేసే నగలు, రూ.3 లక్షలు, పట్టుచీరలు దొంగిలించారు.

ఈ చోరీపై అప్పట్లోనే శీతల్‌ ముఖర్జీ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ ఈ కేసు ముందుకు సాగలేదు.. పోయిన సొత్తు రికవరీ కాలేదు. దీనిపై శీతల్‌ ముఖర్జీ హైదరాబాద్‌లోని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయగా ఈ కేసును విచారించిన కన్స్యూమర్ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది.

అదేంటంటే.. రైల్వే శాఖ బాధ్యతను గుర్తు చేసి రైలులో చోరీ జరిగితే దాని బాధ్యత రైల్వేదే అని స్పష్టం చేసింది. రైల్వే ప్రయాణికుడిని వినియోగదారుడిగా పరిగణించాలని, భద్రత కల్పించాల్సిన బాధ్యత రైల్వే వర్గాలదే అని తేల్చి చెప్పింది. అంతేకాకుండా చోరీకి గురైన బంగారు నగల మొత్తాన్ని చెల్లించాలని, రైలులో ప్రయాణికురాలి లగేజీ చోరీ అయిన ఈ కేసులో నాలుగేళ్ల తర్వాత కన్స్యూమర్ కోర్టు కీలక తీర్పు ఇచ్చి ప్రయాణికురాలికి న్యాయం చేసింది. ఈ కేసులో బాధితురాలికి రూ.17 లక్షల పరిహారాన్ని ఇప్పించడం సంచలనం కలిగించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •