గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు కొనసాగిస్తున్న ఆందోళనతో ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చి విద్యార్థులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చింది.

ఇంతకీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసుకుందామా..! ఇప్పటికే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ విషయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసేసుకున్నారు మరియు చాలా మంది విద్యార్థులు ఫెయిలవడంతో వీరందరికీ రి కౌంటింగ్ మరియు రి వాల్యుయేషన్ ఫీజులను ఇప్పటికే కట్టి ఉన్నారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఇలాంటివారికి వరంగా మారనుంది అదేంటంటే.. ఒకవేళ ప్రభుత్వం కేటాయించినటువంటి మార్కులతో విద్యార్థులు సంతృప్తి చెందక పోయినట్లయితే మళ్లీ ఫీజులను తిరిగి ఇచ్చేస్తామని ఆమె అన్నారు.

ఒకవేళ కావాలనిపిస్తే రి వాల్యుయేషన్, రి కౌంటింగ్ చేయించుకోవచ్చని తెలియజేశారు. దీనిపై విద్యార్థులకు ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో వారు ఇంటర్ బోర్డుకు ఆయా వివరాలు తెలపాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. పాస్ పర్సంటేజ్ అనేది తక్కువగా నమోదు కావడంలో ఇంటర్ బోర్డ్ నుండి ఎలాంటి పొరపాట్లు జరగలేదని మంత్రి తెలియజేశారు. అనవసరంగా ప్రతిపక్షాలే పాస్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నదని ప్రభుత్వంపై రాద్ధాంతం చేస్తున్నాయని దీనిలో బోర్డు పొరపాటు ఏమీ లేదని ఆమె అన్నారు.

ఆన్లైన్ లో నిర్వహించిన క్లాసులు సరిగా జరగలేదన్న ప్రచారంలో వాస్తవం లేదని, విద్యార్థులతో లెక్చరర్లు ఎప్పటికప్పుడు టచ్లోనే ఉన్నారని తెలిపారు. విద్యార్థులు పరీక్ష తప్ప గానే బోర్డు ముందుకు వచ్చి ధర్నాలు చేయకుండా ఎందుకు ఫెయిల్ అవ్వాల్సి వచ్చిందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని, కష్టపడి చదివితే ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదని, ఇంత ఆందోళన చేపట్టే అవసరం వచ్చేది కాదని, ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాలని సూచించారు. ఇప్పటికైనా విద్యార్థులంతా కష్టపడి బాగా చదివి ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని మంత్రి సబితా విజ్ఞప్తి చేసారు.