ఈజిప్టులోని సూయిజ్‌ కాలువలో ప్రమాదవశాత్తు ఒక కార్గో నౌక భాగం భూమిలో కొంతమేర కూరుకుపోయింది అన్న విషయం పాఠకులకు తెలిసిందే! దానిని నీటిపై తెలియాడేలా చేయడానికి గత మంగళవారం నుండి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు అది ఇప్పుడు కొంత కదిలిందని, పాక్షికంగా నీటిపై తేలియాడుతున్నట్లు మారిటైమ్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌ ఇంచ్‌కేప్‌ వెల్లడించింది.

ఓడ కూరుకుపోయిన ప్రాంతంలో ఇసుక, బంకమట్టిని డ్రెడ్జర్లు తవ్వుతుండగా టగ్‌బోట్లు నౌకను కదిలించే ప్రయత్నం చేస్తూ ఓడ కిందన ఇసుకను తవ్వి నీటిని పంప్‌ చేయడంతో తెల్లవారుజాము నాటికి ఎవర్‌ గివెన్‌ మళ్లీ నీటిపై తేలియాడుతున్నట్లు ఇంచ్‌కేప్‌ తెలిపింది. ఇందుకోసం 18 మీటర్ల లోతులో దాదాపు 27వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తొలగించారు. అయితే ప్రస్తుతం ఈ నౌక సూయిజ్‌ కాలువలో అడ్డంగానే ఉన్న కారణంగా నిలువగా కదిలించిన తర్వాతే కాలువలో రాకపోకలకు మార్గం సుగమమవుతుంది. కానీ, దీనికి ఇంకెంత సమయం పడుతున్నది స్పష్టంగా తెలియరావట్లేదు. అయితే ఓడ నీటిపైకి రావడంతో అతి త్వరలోనే దీన్ని కాలువ నుంచి బయటకు తీసుకురావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.