కుయికురో అనే ఓ ఆదివాసీ వర్గం కోవిడ్‌ను తమకు తాముగా జయించింది. ఔషధాల కోసం కుయికురో వర్గం వాళ్లు ముందుగానే విరాళాలు సేకరించుకున్నారు. తమ గ్రామాల్లో లాక్‌డౌన్ విధించుకున్నారు. పూర్వం తట్టు వ్యాధి తమకు నేర్పించిన పాఠాలను ఉపయోగించుకుంటూ ముందుకు సాగారు.కోవిడ్ మహమ్మారిని తాము సమర్థంగా ఎలా ఎదుర్కొన్నది కుయికురో వర్గం నాయకుడు యనమా కుయికురో వివరించారు.

మా గ్రామాల్లో ప్రధాన గ్రామమైన ఇపాట్సేలో నేను ఉంటున్నాను.మా ఊరి జనాభా 390. వైరస్ బారినపడి చాలా మంది చనిపోతుంటే ప్రమాద తీవ్రత ఏంటో అర్థం చేసుకుని అనేక చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నాం. పూర్వం తట్టు వ్యాధి ఎలా ప్రబలింది? ఎగువ షింగులో ఎంత మందిని బలి తీసుకుంది లాంటి వివరాలన్నీ మా నాన్న నాకు చిన్నప్పుడు చెప్పేవారు. ఈ కొత్త వైరస్ గురించి విన్నాక మా పెద్దలకు అదే మహమ్మారి గుర్తుకువచ్చింది.

మాకు మేం సంఘటితం కావాలి. లాక్‌డౌన్ విధించుకోవాలి’ అని అనుకున్నాం. రోగులను విడిగా ఉంచేందుకు ఓ గృహం కట్టాం. అమెజాన్ హోప్స్ కలెక్టివ్ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.26 లక్షల విరాళాలు సేకరించాం. ఆక్సీజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఓ డాక్టర్‌ను, నర్సును కూడా మా కోసం నియమించుకున్నాం.

జూన్-జులైలో మరో మున్సిపాలిటీ నుంచి వచ్చిన వారి ద్వారా కోవిడ్ మా గ్రామంలోకి ప్రవేశించింది. మా డాక్టర్ ర్యాపిడ్ పరీక్ష చేసి, పాజిటివ్ కేసు గుర్తించారు. ఆ కుటుంబం ఐసోలేషన్‌లోకి వెళ్లింది. మా గ్రామంలో దాదాపు 160 మంది కోవిడ్ బారినపడ్డారు. అందరూ ఐసోలేషన్‌కు వెళ్లారు. మేం అప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాం. సమీప పట్టణాల నుంచి ఆహార పదార్థాలు సమకూర్చుకున్నాం. రోగులకు చికిత్స అందించే వైద్య బృందం… వారికి వాటిని అందజేసేది. కానీ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు.

వ్యాక్సీన్ రావడంతో చాలా ప్రాణాలను కాపాడినట్లైంది. వ్యాక్సీన్లు తీసుకోకూడదని ప్రచారం చేస్తూ ఆదివాసీలను కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కొంత మంది ఆదివాసీలు ఆ మాటలను నమ్మినా కూడా వర్గం వారితో ఈ విషయమై మాట్లాడి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించాం అని అన్నారు.