పోలీసులు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ఆదివారం అర్బన్‌ పరిధిలో మాస్కు ధరించని వారిపై అమ్మిరెడ్డి లాడ్జికూడలి, ఎంటీబీ కూడలిలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడం గుర్తించిన ఎస్పీ పిలిచి మాస్కు ఎందుకు ధరించలేదని ప్రశ్నించగా అత్యవసరంగా విధుల్లో హాజరవ్వడానికి వెళుతూ మర్చిపోయినట్లు సమాధానమిచ్చారు. కరోనా వైరస్‌ ఉద్ధృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని, మాస్కు ధరించని కారణంగా అతనికి అపరాధ రుసుం విధించాలని అక్కడి అధికారులను ఆదేశించిన అనంతరం ఎస్పీ స్వయంగా మాస్కు తెప్పించి సీఐకి తగిలించారు.

డ్రైవ్‌ సందర్భంగా మాస్కు ధరించకుండా వెళుతున్న వాహనచోదకులు, పాదచారులకు ఎస్పీ హితబోధ చేసి మాస్కులు ధరింపచేసి పంపించారు. సమీపంలోని వ్యాపారులను పిలిచి దుకాణాల్లోకి మాస్కులు ధరించిన వారినే అనుమతించాలనీ, దుకాణాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలనీ, నలుగురికి మించి ఉంచవద్దనీ, వైరస్‌ వ్యాప్తి కట్టడికి ప్రతి ఒక్కరు బాధ్యతతో మెలగాలని సూచించారు. ఎస్పీ వెంట స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ బాలసుందరరావు, సీఐ నరేష్‌కుమార్‌, ఎస్సైలు ఉన్నారు.