కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించినప్పుడు, వయసుతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులందరికీ ముందు వ్యాక్సీన్ అందించాలని ‘ది యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ’ సూచించింది. బ్రిటన్‌లాంటి దేశాల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సీన్ అందిస్తున్నారు. 45 నుంచి 59 ఏళ్ల వయసువారికి కూడా వ్యాక్సీన్ అందించాలని భారత్ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. కానీ అధిక రిస్క్ ఉన్నవారి గురించి ఏమీ చెప్పలేదు.

క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న అనేకమంది రోగులు ఆస్పత్రులకు వచ్చి చికిత్స చేయించుకోవాలి. వారికి కోవిడ్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుంది.ఇలాంటి అధిక రిస్క్ ఉన్నవారికి వెంటనే వ్యాక్సీన్లు అందించాల్సిన అవసరం ఉంది.

క్యాన్సర్ బాధితులకి కొత్త వ్యాక్సీన్ నిబంధనలు ప్రవేశపెట్టాల్సి ఉంటుందని, రెండు డోసులకు మధ్య సరైన కాలపరిమితి నిర్ణయించాల్సి ఉంటుంది. సాలిడ్, హెమటాలజికల్ క్యాన్సర్ బాధితుల్లో వ్యాక్సీన్ (ఫైజర్-బయోఎన్‌టెక్) మొదటి డోసు తీసుకున్న మూడవ వారానికి కేవలం 39%, 13% యాంటీబాడీలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయని, క్యాన్సర్ లేనివారికి 97% యాంటీబాడీస్ వృద్ధి చెందుతున్నాయని” కింగ్స్ కాలేజ్ లండన్, ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా చేసిన ఒక పరిశోధనలో వెల్లడైంది. అయితే, మూడు వారాల తరువాత రెండవ డోసు తీసుకున్న సాలిడ్ క్యాన్సర్ బాధితుల్లో రోగ నిరోధక శక్తి అమాంతంగా పెరుగుతోందని, 95% యాంటీబాడీస్ వృద్ధి చెందుతున్నాయని ఈ పరిశోధనలో తేలింది. మూడు వారాల తరువాత రెండో డోసు తీసుకోనివారి పరిస్థితి మాత్రం మెరుగవ్వలేదని ఈ అధ్యయనంలో తెలిపారు.