క్రైమ్ (Crime) వార్తలు (News)

ఆటోతో ఢీకొట్టి న్యాయమూర్తి హత్య..!

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లాలో జిల్లా కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ను బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టి హత్య చేశారు. మొదట ప్రమాదంగా దీనిని భావించినప్పటికీ సీసీటీవీ రికార్డులను పరిశీలించిన అనంతరం హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో జాగింగ్‌ చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డు పక్కన జాగింగ్‌ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ ఆటో వచ్చి ఆయనకు ఢీకొట్టి వేగంగా వెళ్లింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆయనను అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ న్యాయమూర్తి కన్నుమూశారు. అయితే చనిపోయిన వ్యక్తి ఓ జడ్జి అని తెలియకపోవడంతో కొన్ని గంటల వరకు ఆయన మృతి విషయం బయటకు రాలేదు.

ఉదయం 7 గంటలవుతున్నా జస్టిస్‌ ఆనంద్‌ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే గాలింపు చేపట్టడంతో ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో మరణించినట్లు తెలిసింది. దీంతో హిట్‌ అండ్‌ రన్‌గా పోలీసుల కేసు నమోదు చేశారు. కానీ ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది. వాహనంలోని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆయనను ఢీకొట్టినట్లు తెలియడంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో ఘటనకు ఉపయోగించిన ఆటోను కొద్ది గంటల ముందే దొంగలించినట్లు, ఇప్పటివరకు ఆటో డ్రైవర్‌, మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. జస్టిస్‌ ఆనంద్‌ ధన్‌బాద్‌లో అనేక మాఫియా హత్య కేసులను విచారించారు. ఇటీవల ఇద్దరు గ్యాంగ్‌స్టర్లకు బెయిల్‌ నిరాకరించారు. ఈ క్రమంలో ఆయన హత్యకు గురవడం కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •