వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

టోక్యో ఒలింపిక్స్ లో మేరీ ఓటమి..!!

20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌.. ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌, ఒలింపిక్స్‌లో కాంస్యం, ఐదు సార్లు ఆసియా విజేత బాక్సింగ్‌ ప్రపంచంలో ఎన్నో అపూర్వ విజయాలు అందుకున్న మేరీ సాధించాల్సింది మరేమి లేకపోయినప్పటికీ 38 ఏళ్ల వయసులో టోక్యోలో స్వర్ణపతకం గెలిచి భరతమాత మెడలో అలంకరించాలని ఆమె ఆశించింది. 51 కిలోల విభాగంలో ఆమె కారణంగానే యువతకు అవకాశాలు రావడం లేదన్న విమర్శను కూడా తట్టుకుని గెలవాలని తపించిన ఆమె టోక్యో ఒలింపిక్స్‌ ప్రిక్వార్టర్స్‌లోనే ఆమె నిష్క్రమించవలసి వచ్చింది. నిజానికి ఈ వయసులో బాక్సింగ్‌ అనేది కష్టతరమైనది.

ఓటమి భారంతో మేరీ బాక్సింగ్‌ రింగ్‌లోనే విలపిస్తూ కన్నీరు కార్చింది. 51 కిలోల విభాగంలో రియో కాంస్యపతక విజేత, కొలంబియాకు చెందిన వలెన్షియా విక్టోరియా ఇంగ్రిట్‌ లొరనా చేతిలో 2-3 తేడాతో పరాజయం చవిచూసింది. హోరాహోరీగా సాగిన పోరు చివర్లో రిఫరీ తన ప్రత్యర్థి చేయి పైకెత్తగానే మేరీ ఒకపక్క నవ్వుతూనే.. తన బాధను భరించలేక ఏడ్చేసింది.

వీరిద్దరి మధ్య పోరు ఆరంభమవ్వగానే బాక్సింగ్‌ రింగులో ఓల్టేజీ తారస్థాయికి చేరుకుని ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతూ పాయింట్ల కోసం శ్రమిస్తూ ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించసాగారు. తొలిరౌండ్లో త్రుటిలో వలెన్షియాకు ఆధిక్యం దక్కింది. ఐదుగురు జడ్జీలు ఆమెకు 49 పాయింట్లు ఇవ్వగా మేరీకోమ్‌కు 46 మాత్రమే కేటాయించారు. దాంతో 4-1తో వలెన్షియా ముందంజ వేసింది.

ఆ తర్వాతి రెండు రౌండ్లలో భారత బాక్సర్‌ విజృంభించింది. తన అనుభవాన్ని ఉపయోగించి పంచ్‌లు విసిరింది. ప్రత్యర్థి సైతం అదే రీతిలో చెలరేగినా 3-2 తేడాతో రెండు రౌండ్లనూ గెలిచింది. అయితే తొలిరౌండ్లో వలెన్షియాకు స్వల్ప ఆధిక్యం ఉండటంతో మేరీకోమ్‌ ఓటమి పాలైంది. మొత్తంగా ఈ పోరులో 27-30, 28-29, 30-27, 28-29, 29-28 తేడాతో పరాజయం చవిచూసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •