సూడాన్‌లోని పశ్చిమ కొర్డోఫాన్ ప్రావిన్స్‌లో మంగళవారం బంగారు గని కుప్పకూలడంతో కనీసం 38 మంది మరణించారు.

రాజధాని ఖార్టూమ్‌కు దక్షిణంగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫుజా గ్రామంలో మూసి ఉన్న గనిలో ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో కొందరికి గాయాలయ్యాయని సూడాన్ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనతో ఘటనాస్థలానికి చేరుకున్న గ్రామస్తులు సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలను వెలికి తీసేందుకు రెండు ప్రొక్లెయిన్లను ఉపయోగిస్తున్నారు. నిర్దిష్ట లెక్కలు చెప్పకుండా పెద్ద సంఖ్యలో గాయపడ్డారని మాత్రమే
ప్రభుత్వ మైనింగ్ కంపెనీ పేర్కొంది. దర్శయ గనిలో అనేక షాఫ్ట్‌లు కూలిపోయాయని, మృతులతో పాటు కనీసం ఎనిమిది మంది గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారని స్థానిక మీడియా వెల్లడించింది

సుడాన్ దేశం మొత్తం అనేక బంగారు గనులు ఉన్నాయి. 2020లో తూర్పు ఆఫ్రికా దేశం 36.6 టన్నులను ఉత్పత్తి చేసింది. అధికారిక లెక్కల ప్రకారం ఖండంలో ఇదే రెండవది. కానీ బంగారం స్మగ్లింగ్ ఆరోపణల నేపథ్యంలో గత రెండేళ్లలో సుడాన్ ప్రభుత్వం బంగారం అక్రమ తవ్వాలను నియంత్రించడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఫుజా గ్రామంలోని ఈ బంగారం గనిని మూసివేయగా స్థానికులు గనిలో అక్రమ తవ్వకాలు చేపడుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.