దేశ వ్యాప్తంగా నేడు వైద్య సేవలు స్తంభించనున్నాయి. నీట్ పీజీ కౌన్సెలింగ్ చేపట్టాలన్న ఏకైక డిమాండ్‌తో రెసిడెంట్ వైద్యులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో భాగంగా మంగళవారం మౌలానా ఆజాద్ వైద్య ఆస్పత్రి, కాలేజీ నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బుధవారం దేశ వ్యాప్తంగా వైద్య సేవల బంద్‌కు రెసిడెంట్ వైద్యులు పిలుపునిచ్చారు.

నిజానికి నీట్ పీజీ కౌన్సెలింగ్ చేపట్టాలన్న డిమాండ్‌తో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో రెసిడెంట్ వైద్యులు నెల రోజులుగా దశల వారీగా ఆందోళన చేస్తున్నా కానీ కేంద్రం ఏమాత్రం స్పందించ లేదు. దానికి తోడు మంగళవారం ఆజాద్ మెడికల్ ఆస్పత్రి నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీని తలపెట్టగా, పోలీసులు అడ్డుకుని భగ్నం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ కూడా చేశారు. దీనిపై ఆగ్రహించిన రెసిడెంట్ వైద్యులు బుధవారం దేశ వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయాలని రెసిడెంట్ వైద్యులకు పిలుపునిచ్చారు. ఉదయం 8 గంటల నుంచే విధులకు దూరంగా ఉండాలని కోరారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న రెసిడెంట్ వైద్యులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఫెడరేషన్ ఆప్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ మంగళవారాన్ని బ్లాక్ డే గా ప్రకటించారు.