ఒకవైపు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కార్‌పై ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌పైన మాత్రం ప్రశంసల జల్లు కురిపించారు. వైఎస్ సొంత జిల్లాలోనే వైఎస్సార్‌పై నిమ్మగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనం చూసిన గొప్ప నేతల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒకరని ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఆయన ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు గానూ వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ… వైఎస్సార్ పేరు మీద ఏర్పాటు చేసిన జిల్లాలో అధికారిక సమీక్షలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన కెరీర్లో ఒక గొప్ప మలుపు వచ్చింది వైఎస్సార్ వల్లనే అని, ఆయన దగ్గర పని చేయడం వల్లనే తనకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. వైఎస్సార్ తనను గుర్తించి కీలకమైన ఫైనాన్స్ సెక్రటరీగా మూడు సంవత్సరాలు పని చేసే అవకాశం కల్పించారన్నారు.
ఆ తర్వాత కూడా వైఎస్సార్ ఆశీస్సులతోనే తాను రాజ్ భవన్లో కీలక పదవిలో పని చేసేందుకు వెళ్లానని, రాజ్ భవన్లో ఏడేళ్ల పాటు పని చేసిన తర్వాత రాజ్ భవన్ ఆశీస్సులతోనే తనకు ఎన్నికల కమిషనర్‌గా అవకాశం వచ్చిందని, ఇంకెవరి ఆశీస్సుల వల్లనో కాదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. వైఎస్సార్ నిజాలను చెప్పే స్వేచ్ఛను ఇచ్చేవారని, ఆయనకు రాజ్యాంగ వ్యవస్థల మీద మంచి గౌరవం ఉండేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.