కేరళ రాష్ట్రం పతనంతిట్ట జిల్లాలోని కుదస్సనాడులో సాబూ అనే వ్యక్తి తిరువనంతపురంలో క్యాటరింగ్, బస్‌ క్లీనింగ్‌ వంటి ఉద్యోగాలు చేస్తూ పొట్టపోసుకునేవాడు . ఇతనికి చిన్న చిన్న చోరీలు చేసే అలవాటు ఉండడంతో తను పనిచేసే హోటల్‌లో డబ్బు దొంగతనం జరగ్గా ఆ కేసులో పోలీసులు సాబూను గతేడాది నవంబరులో అరెస్టు చేశారు. ఆ తర్వాత అతని గురించి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదు. డిసెంబర్‌ 24న కొట్టాయం జిల్లా పాలా పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడంతో తిరువనంతపురం పోలీసులు ఆ మృతదేహం సాబూదేనన్న అనుమానంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా ఆ దేహం సాబూదేనని పొరపాటు పడిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇంతలో ఆ వ్యక్తి నిక్షేపంగా శుక్రవారం ఒక బస్‌ డ్రైవర్‌కు తటస్థపడ్డాడు. సాబూను గుర్తుపట్టిన డ్రైవర్‌ సమాచారాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకూ తెలియజేశారు. దీంతో పోలీసులు గత డిసెంబర్‌లో అంత్యక్రియలు జరిపిన మృతదేహం ఎవరిదో తెలుసుకునే పనిలో పడ్డారు.