దేశంలో కొవిడ్ మహమ్మారి నియంత్రణకు పౌర విమానయాన సంస్థ డీజీసీఏ కొన్ని కఠిన చర్యలకు ఉపక్రమించింది. కరోనా నిబంధనలు పాటించని ప్రయాణికులను విమానాల నుంచి దించేయాలని ఇప్పటికే విమానయాన సంస్థలను ఆదేశించిన డీజీసీఏ ఇప్పుడు తాజాగా ఎయిర్‌పోర్టులలో మాస్క్‌లు లేకుండా కన్పించేవారిపై తక్షణ జరిమానాలు విధించాలని మంగళవారం ఓ సర్క్యులర్ జారీ చేసింది.
ఇటీవల జరిపిన పరిశీలనలో ‘‘కొన్ని విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనల అమలు సంతృప్తికరంగా లేదని తేలడంతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా విమానాశ్రయ నిర్వాహకులు చూసుకోవాలి. ముక్కు, నోటిని కవర్ చేసేలా మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం వంటి నియమాలను పాటించేలా అన్ని ఎయిర్‌పోర్టులు మరింత నిఘా పెంచాలని కోరుతున్నాం. నిబంధనల ఉల్లంఘనలను నిరోధించేందుకు అవసరమైతే శిక్షార్హమైన చర్యలు కూడా తీసుకునే అంశాన్ని పరిశీలించండి.స్థానిక పోలీసు అధికారుల సహకారంతో నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం తక్షణ జరిమానాలు విధించండి అని డీజీసీఏ విమానాశ్రయ నిర్వాహకులను సూచించింది.