రివ్యూ రాజా (Review Raja) వార్తలు (News) వినోదం

సినిమా రివ్యూ: తిమ్మరుసు

చిత్రం పేరు: తిమ్మరుసు; న‌టీన‌టులు: సత్యదేవ్‌, ప్రియాంక జవాల్కర్‌‌, అజయ్‌, అల్లరి రవిబాబు, బ్రహ్మాజీ, అంకిత్, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, వైవా హర్ష, సంధ్యా జనక్‌,ఝాన్సీ తదితరులు; సంగీతం: శ్రీచరణ్‌ పాకాల; ఛాయాగ్రహణం: అప్పూ ప్రభాకర్‌; క‌ళ‌: కిరణ్‌ కుమార్‌ మన్నె; పోరాటాలు: వెంకట్ మాస్టర్, రియల్‌ సతీశ్‌; నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌; దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి; సంస్థ‌: ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్, ఎస్‌.ఒరిజిన‌ల్స్‌; విడుద‌ల‌: 30-07-2021

థియేట‌ర్లు అతి కష్టం మీద తెరుచుకున్న సంగతి పాఠకులకు తెలిసిందే! థియేట‌ర్లు తెరిచిన తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో తెలియక ఇప్పటి వరకు సినిమాలు అన్ని ఓటీటీ లో విడుదల అవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ధైర్యం చేసి ‘తిమ్మ‌రుసు’ సినిమా ను థియేట‌ర్ల లో విడుదల చేసారు. మంచి క‌థ‌ల్ని ఎంచుకుంటూ మంచి పాత్ర‌ల్లో ఒదిగిపోయే స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.

కథా కమామీషు ఏమిటో చూద్దాం!
చాలా చిన్న ప్లాట్ తీసుకుని దానిని ఆశక్తికరంగా మలచడంలో చిత్ర దర్శకుడు సఫలమయ్యాడనే చెప్పాలి. న్యాయం గెల‌వ‌డ‌మే ముఖ్యం అనుకునే యువ న్యాయ‌వాది రామ‌చంద్ర అలియాస్ రామ్ (స‌త్య‌దేవ్‌). ఒక క్యాబ్ డ్రైవ‌ర్ అర‌వింద్ హ‌త్య కేసులో ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించిన ఒక అమాయ‌క కుర్రాడు వాసు (అంకిత్‌) కేసుని రీ ఓపెన్ చేయిస్తాడు. వాసు జైలు పాలు కావ‌డంలో పోలీస్ అధికారి భూప‌తిరాజు (అజ‌య్) ఏ పాత్ర ఏమిటి? ఇంత‌కీ క్యాబ్ డ్రైవ‌ర్ అర‌వింద్ హ‌త్య వెన‌క ఎవ‌రున్నారు? వాళ్ల‌ని రామ్ త‌న తెలివితేట‌ల‌తో ఎలా బ‌య‌టికి తీసుకొచ్చాడు? ఈ క‌థ‌లో వాలి ఎవ‌రు?అత‌ని పాత్ర ఏమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: క‌థానాయ‌కుడు న్యాయ‌వాది అంటే ఇదొక కోర్టు రూమ్ డ్రామా అనే అపోహ ఉంటుంది. పైగా వకీల్ సాబ్ లాంటి సినిమాలతో ఇప్పుడు ఆ క‌థ‌ల ట్రెండ్ కూడా న‌డుస్తోంది. అయితే ఇందులో కోర్టు రూమ్ డ్రామా కంటే కూడా నేర నేప‌థ్య‌మే ఎక్కువ‌గా ఉంటూ ఒక హ‌త్యా నేరం వెన‌క అస‌లు గుట్టుని బ‌య‌ట పెట్ట‌డం కోసం ఒక మామూలు న్యాయ‌వాది త‌న తెలివి తేట‌ల‌న్నింటినీ కేంద్రీక‌రించి ప‌రిశోధ‌న జ‌రుపుతుంటాడు. ఆ క్ర‌మంలో ఎలాంటి విష‌యాలు వెలుగులోకి వ‌స్తుంటాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మలిచాడు దర్శకుడు! అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌డానికి మాత్రం చాలా స‌మ‌య‌మే తీసుకున్నప్పటికీ దానిని ఉత్కంఠ భరితంగా మలచడంలో దర్శకుడు సఫలమయ్యాడనే చెప్పాలి. స‌హ‌జంగా ఒక కేసుని చేప‌ట్టాక దాని పూర్వప‌రాల‌న్నీ కూలంక‌షంగా తెలుసుకుని రంగంలోకి దిగుతాడు న్యాయ‌వాది. త‌న తెలివి తేట‌ల‌తో ప‌ని మొద‌లు పెడ‌తాడు. ఇందులో మాత్రం న్యాయ‌వాది ప్ర‌తి ప‌ది నిమిషాల‌కి ఓ విష‌యం తెలుస్తుండడంతో ఈ విషయం ముందే ఎందుకు చెప్ప‌లేదని బాధితుడిని అడుగుతుంటాడు. ఆ స‌న్నివేశాలు ఏమాత్రం ఆస‌క్తి లేకుండా సాగుతున్న‌ట్టు అనిపిస్తాయి. విరామ స‌న్నివేశాల నుంచి క‌థపై ద‌ర్శ‌కుడు కాస్త ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాడు. సాక్ష్యాల్ని సేక‌రిస్తున్న‌ కొద్దీ, వాటిని హంతకుడు మాయం చేయ‌డం క‌థ‌లో లీన‌మ‌య్యేలా చేస్తుంది. ద్వితీయార్ధంలో క‌థలోని పార్శ్వాలు ఆక‌ట్టుకుంటాయి. ఈ కేసుకీ, క‌థానాయ‌కుడి వ్య‌క్తిగ‌త జీవితానికీ ముడిపెట్టిన తీరు మ‌రింత‌గా మెప్పిస్తుంది. ప‌తాక స‌న్నివేశాలు చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే: స‌త్య‌దేవ్ నటన గురించి చెప్పవలసిన అవసరం లేనప్పటికీ యువ న్యాయ‌వాదిగా అయన చాలా బాగా న‌టించారు. సుధ (బ్ర‌హ్మాజీ)తో క‌లిసి అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తూ… ద్వితీయార్ధంలో భావోద్వేగాలు పంచుతూ పాత్ర‌లో ఒదిగిపోయారు స‌త్య‌దేవ్. అను అనే యువ‌తిగా క‌థానాయిక ప్రియాంక జ‌వాల్క‌ర్ న‌టించగా క‌థ రీత్యా ఇందులో డ్యూయెట్లలో ఆడిపాడే అవ‌కాశం ద‌క్క‌లేదు కానీ హీరో ప్రేయ‌సిగా కనిపిస్తుంది. అజ‌య్ అల‌వాటైన పాత్ర‌లో ఒదిగిపోయాడు. అమాయ‌క కుర్రాడిగా అంకిత్ న‌ట‌న బాగుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. శ్రీచ‌ర‌ణ్ పాకాల నేప‌థ్య సంగీతం, అప్పు కెమెరా ప‌నిత‌నం చిత్రానికి బ‌లాన్నిచ్చాయి. ప‌రిమిత వ్య‌యంతో నాణ్యత‌తో నిర్మించారు. ద‌ర్శ‌కుడు శరణ్‌ కొప్పిశెట్టి క‌థ‌నాన్ని న‌డిపిన తీరు బాగుంది.

బ‌లాలు

  • క‌థ‌… క‌థ‌నం
  • స‌త్య‌దేవ్ న‌ట‌న
  • విరామ స‌న్నివేశాలు, ద్వితీయార్ధం

బ‌ల‌హీన‌త‌లు:
ప్ర‌థ‌మార్థంలో కొన్ని స‌న్నివేశాలు

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •