అంతర్జాతీయం (International) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News) వినోదం

ఎలాంటి టెక్నాలజీ వాడకుండా గ్రామం కోసం కొండలో సొరంగం!!

ప్రాచీన కట్టడాలు, ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలోనే కొండలపై కోటలు నిర్మించిన తీరు మనల్ని అబ్బుర పరుస్తుంది. అయితే గావులియంగ్‌ చైనాలోని తైహాంగ్‌ పర్వత ప్రాంతంలో ఉన్న కొండపై ఒక చిన్న గ్రామం. ఆ గ్రామస్థులు కేవలం ఉలి, సుత్తి సాయంతో 1.2కిలోమీటర్ల మేర కొండలో సొరంగ మార్గం నిర్మించారు. దీంతో ఆధునిక కాలంలో అసాధారణ నిర్మాణంగా గుర్తింపు పొందిన ఈ కొండపై రోడ్డు పర్యటక ప్రాంతంగా మారిపోయింది.

చైనాలోని తైహాంగ్‌ పర్వత ప్రాంతంలో ఉన్న గావులియంగ్‌ కొండపై సముద్రమట్టానికి 1,700 మీటర్ల ఎత్తులో ప్రపంచానికి దూరంగా ఉన్న చిన్న గ్రామం. ఇక్కడి ప్రజలు నిత్యావసర వస్తువులు ఏవైనా తెచ్చుకోవాలంటే కొండకు వేలాడదీసిన పురాతనమైన 720 మెట్ల నిచ్చెన ద్వారా బయటకు వెళ్ళవలసి ఉంటుంది. ఎవరైనా అస్వస్థతకు గురైతే ఎనిమిది మంది సాయంతో బాధితుడిని కిందకి దించాల్సి రావడంతో చాలా సమయం పట్టేది. అంత కష్టపడి కిందకి దించినా నాలుగు గంటలు ప్రయాణిస్తే కానీ, ఆస్పత్రి కనిపించదు. పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకెళ్లడానికి వీలు లేక ఆర్థికంగా కూడా నష్టపోయేవారు. మూడు దశబ్దాల కిందటి వరకూ ఇదే పరిస్థితులలో ఉన్నా 1972లో గ్రామంలోని పదమూడు మంది తీసుకున్న నిర్ణయం వారి జీవితాల్ని పూర్తిగా మార్చేసింది.

తమ గ్రామం నుంచి సమీప నగరానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని ఆ ఊరి ప్రజలు ప్రభుత్వానికి ఎంత విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో 1972లో ఊరిలోని పదమూడు మంది యువకులు తామే కొండలో సొరంగ మార్గం నిర్మించాలని నిర్ణయించుకుని టెక్నాలజీని ఉపయోగించేంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఉలి, సుత్తితో కొండ అంచులో సొరంగం తొవ్వడం మొదలుపెట్టారు. ఎంత శ్రమించినా ఒక మీటరు సొరంగానికి మూడు నెలల సమయం పట్టినప్పటికీ వెనకడుగు వేయకుండా మరింత పట్టుదలగా పనిచేయడం ప్రారంభించారు. వారి దృఢ సంకల్పాన్ని చూసి గ్రామంలోని మరికొందరు సాయంగా రావడంతో బలం, పనితనం పెరిగింది. అలా ఐదేళ్లు శ్రమించి కొండపై నుంచి కిందకి 1.2కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించారు.

అప్పటి వరకు అక్కడో గ్రామం ఉందన్న విషయమే ప్రపంచానికి తెలియదు. కొండపై రోడ్డు కనిపించడంతో అక్కడో గ్రామం ఉందన్న విషయం అప్పుడే ప్రపంచానికి తెలుసొచ్చింది. కొండ అంచుల్లో సొరంగ మార్గంలో సాహస ప్రయాణం చేయడానికి ఇష్టపడేవారు ఈ గ్రామానికి క్యూ కట్టగా ఈ గ్రామం సందర్శక ప్రాంతంగా మారింది. ఇప్పుడు ఆ గ్రామస్థులకు పంటలపై వచ్చే ఆదాయమే కాకుండా పర్యటకంగానూ ఆదాయం లభిస్తోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •