అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

అఫ్గాన్‌ విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న 2వేల మంది జర్నలిస్టులు!!

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భయంతో వేల మంది పౌరులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడి జర్నలిస్టులు కూడా అఫ్గాన్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు. ఇలా దాదాపు 2వేల మంది అఫ్గాన్‌ జర్నలిస్టులు దేశం విడిచి వెళ్తామంటూ అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (IFJ)కు దరఖాస్తు చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీంతో వారిని కాబుల్‌ ఎయిర్‌పోర్టుకు సురక్షితంగా చేరుకునేలా రక్షణ కల్పించాలని కోరుతూ ఐఎఫ్‌జే తాలిబన్లను సంప్రదించింది.

అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గాన్‌లో చోటుచేసుకుంటున్న పరిస్థితులతో యావత్‌ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు తమ పౌరులను తరలించే ప్రక్రియను ముగించగా మరికొన్ని దేశాలు ఆగస్టు 31నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో వివిధ మీడియా సంస్థలకు చెందిన 2వేల మంది సిబ్బంది ఇతర దేశాలకు తరలివెళ్లేందుకు ఐఎఫ్‌జేకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వారికి వీసాలు జారీ చేయాలని స్పెయిన్‌, ఫ్రాన్స్‌, మెక్సికో, ఇటలీ, జర్మనీ, బ్రిటన్‌, అమెరికా, కెనడాతో పాటు మరికొన్ని దేశాలకు ఐఎఫ్‌జే విజ్ఞప్తి చేసింది. అయితే, ఇలా ఒక్కో దేశం కేవలం 10 నుంచి 15 జర్నలిస్టులకు మాత్రమే ఆశ్రయం కల్పించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో విదేశాలకు వెళ్లాలనుకునే మీడియా ప్రతినిధులను ఎయిర్‌పోర్టుకు రాకుండా తాలిబన్‌ సైన్యం అడ్డుకుంటున్నట్లు ఐఎఫ్‌జే ఆరోపించింది. ఈ విషయంలో తాలిబన్లు సహకారం అందించాలని ఇంటర్నేషనల్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ తాలిబన్లకు విజ్ఞప్తి చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    4
    Shares
  • 4
  •  
  •  
  •  
  •