అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

కాబుల్‌లో జరిగిన రాకెట్‌ దాడిలో చిన్నారి మృతి!!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరో ఉగ్రదాడి జరగొచ్చన్న హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో రాకెట్‌ దాడి జరగడంతో కలకలం చెలరేగింది. అమెరికా సైనికులే లక్ష్యంగా ఐసిస్‌ ఉగ్రవాదులు ఈ రాకెట్‌ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానించగా ఈ ఘటనలో ఓ చిన్నారి మృతిచెందినట్లు సమాచారం. అయితే అధికారికంగా ఏ ఉగ్రవాద సంస్థా ఇంకా ఈ ఘటనకు తామే బాధ్యులమని ప్రకటించుకోలేదు.

మరోవైపు అఫ్గానిస్థాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆత్మాహుతికి యత్నించిన దళ సభ్యుడిని అమెరికా బలగాలు మట్టుబెట్టాయి. ఓ వైపు తమ దేశ పౌరుల తరలింపు ప్రక్రియను చేపడుతున్న వేళ ఆత్మాహుతి దాడికి ఓ వాహనంలో సిద్ధంగా ఉన్న వ్యక్తిపై అమెరికా బలగాలు వైమానిక దాడి జరిపాయని తాలిబన్‌ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. మరణించిన వ్యక్తి ఐసిస్‌-కె ఉగ్రవాద ముఠాకు చెందిన వాడిగా భావిస్తున్నారు. ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనలతో మరోసారి కాబుల్‌ దద్దరిల్లింది.

ఇటీవల కాబుల్‌ విమానాశ్రయం వద్ద జరిగిన జంట పేలుళ్ల ఘటనలో 100 మందికి పైగా మరణించారు. ఈ ఘటనలో 13 మంది అమెరికా సైనికులు కూడా మరణించారు. ఆత్మాహుతి దాడికి సూత్రధారిగా ఉన్న ఉగ్రవాది సహా ఇద్దరు కీలక ముష్కరుల్ని అమెరికా బలగాలు శనివారం మట్టుబెట్టాయి. తమ సైనికులను బలిగొన్న ఉగ్రవాదుల్ని విడిచిపెట్టేది లేదని ప్రతిజ్ఞ చేసిన అమెరికా ఆ ప్రకారమే వైమానిక దాడులకు దిగింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •