వార్తలు (News)

పాదచారులకు దారి కరువు .. GHMC ఏమిచేస్తుంది??

ఫుట్‌పాత్‌పై చిరు వ్యాపారులు చాయ్‌ డబ్బాలు, టిఫిన్‌, తోపుడు బండ్లను ఏర్పాటు చేస్తే ఆక్రమణలంటూ తొలగించే జీహెచ్‌ఎంసీ అధికారికంగా తానే ఆక్రమణలకు అనుమతి ఇస్తోంది. మరుగుదొడ్ల సౌకర్యం పేరిట స్నాక్స్‌, కాఫీ, చిరుతిళ్లు అమ్ముకునేందుకు నామమాత్రపు రుసుముతో అవకాశం కల్పిస్తోంది. మహానగర ఫుట్‌పాత్‌లపై అధికారికంగానే ఆక్రమణలు పుట్టుకొస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ఉన్న ఆక్రమణలను తొలగించకపోగా, కొత్త వాటికి జీహెచ్‌ఎంసీ అనుమతి ఇవ్వడం విమర్శలకు దారి తీస్తోంది.

జోనల్‌ అధికారులు సమర్పించిన ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తొలగింపునకు కంటితుడుపు చర్యలు మాత్రమే చేపడుతున్నారని వ్యాఖ్యానించింది. గతంలోనూ పలుమార్లు ఫుట్‌పాత్‌ల నిర్మాణం, ఆక్రమణల తొలగింపుపై న్యాయస్థానం అధికారులకు మొట్టికాయలు వేసింది. అయినా పరిస్థితిలో మార్పు కనిపించకపోగా మరింత అధ్వానంగా మారింది. మెజార్టీ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై పాదచారులు నడిచే పరిస్థితి లేదు. చిరు వ్యాపారాలు, తోపుడు బండ్ల విషయాన్ని పక్కన పెడితే జీహెచ్‌ఎంసీ సహా వివిధ ప్రభుత్వ విభాగాల ఆక్రమణలు ఎక్కువగానే ఉన్నాయి. మౌలిక సౌకర్యాల కల్పనలో భాగమంటూ సర్కారీ శాఖలు ఫుట్‌పాత్‌లపై తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నాయి.

నగరంలో 9,013 కిలోమీటర్ల మేర రహదారులున్నాయి. ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) నిబంధనల ప్రకారం ప్రధాన రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు ఉండాలి. స్థల లభ్యతను బట్టి అంతర్గత రోడ్లపై కూడా పాదచారుల బాటలు నిర్మించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ నగరంలో అందుబాటులో ఉన్న ఫుట్‌పాత్‌లు 790 కి.మీ.లు మాత్రమే. దీంతో నగర రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో 50 శాతానికిపైగా పాదచారులే బాధితులవుతున్నారు. వేగంగా వస్తున్న వాహనాలు రోడ్డు దాటే క్రమంలోనో, రోడ్డు పక్కన వెళ్లే క్రమంలోనో వారిని ఢీకొడుతున్నాయి. ఫుట్‌పాత్‌లు అందుబాటులో లేక మెయిన్‌ క్యారేజ్‌ వేలో నడవడం వల్లే పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారని పలు నివేదికలు స్పష్టం చేశాయి. రెండేళ్ల క్రితం ఫుట్‌పాత్‌ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.87 కోట్లు మంజూరు చేయగా జోన్ల వారీగా ఫుట్‌పాత్‌ల నిర్మాణం, ఆధునికీకరణ చేపట్టిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

ప్రభుత్వ విభాగాలు కూడా ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తున్నాయి. మౌలిక సౌకర్యాల కల్పన పేరిట లూ-కెఫేలు, మరుగుదొడ్లు, బస్‌ షెల్టర్లు వంటివి జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తోంది. ఇందులో లూ-కేఫే పక్కా వ్యాపారం. ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్లు ఉన్న చోట లూ-కెఫేల అవసరమేంటో ఎవరికీ తెలియదు. కేబీఆర్‌ పార్క్‌, ఎన్‌టీఆర్‌ మార్గ్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, సికింద్రాబాద్‌, ఆబిడ్స్‌ తదితర ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు మెజార్టీ నిరూపయోగంగా మారాయి. అయినా, గొప్పగా చెప్పుకునేందుకు టాయిలెట్లు ఏర్పాటు చేసి వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. మరోపక్క టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మెలు, ఫ్యూజ్‌ బాక్స్‌లు, విద్యుత్‌ స్తంభాలను ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేస్తోంది. ఇవన్నీ పాదచారులకు అవరోధంగా మారుతున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •