నెల్లూరు జిల్లాలో అల్పపీడనం కారణంగా నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ ఉదయం గూడూరు- మనుబోలు మధ్య పంబలేరు వరద ప్రవాహంతో 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. మరోవైపు కండలేరు డ్యామ్‌ నుంచి వరద పోటెత్తడంతో సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు చెరువు నిండుకుండలా మారి రోడ్డుపై వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

చుంచులూరు వద్ద కేత మన్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రెండు రోజులుగా ఈ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా 500 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రెండు గ్రామాలపైన ఉన్న చెరువులు ప్రమాదకర స్థాయిలో నీటితో నిండి ఉండటంతో ఏ సమయంలో ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారీ వర్షాలతో సోమశిల జలాశయానికి భారీ వరద పోటెత్తుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 96,569 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 1,15,396క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 77.98టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 68.37టీఎంసీలుగా ఉంది.