రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన మరియమ్మ లాకప్ డెత్ కేసులో హైకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. మరియమ్మ మృతిపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరైన రీతిలోనే జరుగుతోందని పేర్కొంది. మరియమ్మ కస్టోడియల్ మృతిపై విచారణ ముగించిన హైకోర్టు.. ఈ కేసును త్వరితగతిన ముగింపు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అని సూచించింది. మరియమ్మ కస్టోడియల్ మృతిపై ప్రస్తుత దశలో ఎలాంటి చర్యలు అవసరం లేదని దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ ముగించింది.

గతంలో మరియమ్మ లాకప్ డెాత్ పై హైకోర్ట్ లో పిల్ దాఖలవ్వడంతో దీంట్లో మరియమ్మ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందిగా పిటీషన్ దారులు కోరారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. కేసును సీబీఐకి అప్పగిస్తే రాష్ట్ర పోలీసుల పనితీరుపై ప్రభావం పడుతుందని ఇటీవల హైకోర్ట్ కు విన్నవించింది. దీంతో హైకోర్ట్ ఈ రోజు తన తీర్పును వెల్లడించింది.

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసులు మరియమ్మను దొంగతనం కేసులో విచారిస్తూ స్టేషన్‌కు తీసుకురాగా ఆమె అనారోగ్యానికి గురయ్యారని పోలీసులు చెపుతుండగా విచారణలో చిత్ర హింసలు పెట్టడం వల్లే మరియమ్మ చనిపోయారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్‌పై సస్పెన్షన్ వేటు పడింది.