అస్తమించిన సినీ గేయరచయిత సీతారామ శాస్త్రి!!

0
1

సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో న్యూమోనియాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 66 ఏళ్లు. సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు సీతారామశాస్త్రి 1955 మే 20న జన్మించారు. దిగువ మధ్య తరగతి కుటుంబం. పదో తరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకుని కాకినాడలో ఇంటర్, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో బీఏ పూర్తి చేసిన సిరివెన్నెల.. అప్పట్లో పీజీ చేసినా ఉద్యోగం వస్తుందన్న భరోసా లేకపోవడంతో ఎంబీబీఎస్‌ చేయమని ఆయన తండ్రి సలహా ఇచ్చినా ఆ క్రమశిక్షణ తనకు అలవాటు లేకపోవడంతో అంతగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో 10వ తరగతి అర్హతపై కొంతకాలం రాజమహేంద్రవరంలో బీఎస్ఎన్ఎల్‌లో కూడా పని చేశారు. ఉత్తమ సినీ గేయరచయితగా 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెల్చుకున్న సీతారామశాస్త్రి మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.

సీతారామశాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామశాస్త్రికి పాటలు పాడాలని కోరిక ఉండేది. ఒకట్రెండుసార్లు ప్రయత్నించి అది కుదరకపోవడంతో అందుకు తాను పనికిరానని నిర్ధారణకు వచ్చారు. అయితే, కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒకటి పాడుతుండటాన్ని చూసిన ఆయన సోదరుడు ‘అన్నయ్యా కవిత్వం కూడా బాగా రాస్తున్నావు. ప్రయత్నించు’ అని ప్రోత్సహించారు. ఆ తర్వాత ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారు. ఆ సమయంలో సీతారామశాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారు. ఎం.ఏ చేస్తుండగా దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు రావటంతో ‘సిరివెన్నెల’ చిత్రానికి తొలిసారి కలాన్ని కదిలించి అలా తెలుగు ప్రేక్షకుల మదిలో మరపురాని మధురానుభూతిగా నిలిచిపోయే సుమధుర గీతాలెన్నింటినో రాశారు.

కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల (1986) సినిమాతో సినీ గేయరచయతగా పరిచయమైన చేంబోలు సీతారామశాస్త్రి కి సిరివెన్నెల చిత్రంలో ఆయన ఆయన రాసిన పాటలకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. ఆ తరువాత ఆ సినిమా పేరే తన ఇంటిపేరుగా మార్చుకుని దాదాపు 800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.

‘సిరి వెన్నెల’చిత్రంలో ‘విధాత తలపున’ పాటతో మొదలైన సీతారామశాస్త్రి కలం నుండి అలవోకగా ఎన్నో ఆణిముత్యాలు జాలువారాయి. ‘రుద్రవీణ’లో ‘నమ్మకు నమ్మకు ఈ రేయినీ’, ‘లలిత ప్రియ కమలం విరిసినదీ’, ‘స్వర్ణకమలం’లో ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’, శ్రుతి లయలు’లో ‘తెలవారదే స్వామీ’, ‘క్షణక్షణం’లో ‘జామురాతిరి జాబిలమ్మా’, ‘గాయం’లో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’, ‘మనీ’లో ‘చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ’, ‘శుభలగ్నం’లో ‘చిలకా ఏ తోడు లేక’, ‘నిన్నే పెళ్లాడతా’లో కన్నుల్లో నీ రూపమే, ‘సింధూరం’లో ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే’, ‘నువ్వే కావాలి’లో ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే’, ‘బొమ్మరిల్లు’లో ‘నమ్మక తప్పని నిజమైనా’, ‘గమ్యం’లో ‘ఎంత వరకూ ఎందుకొరకు’, ‘కొత్త బంగారు లోకం’లో ‘నీ ప్రశ్నలు నీవే’, ‘చక్రం’లో జగమంత కుటుంబం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’లో దశవతారం, ‘అల వైకుంఠ పురములో’ ‘సామజవరగమన’ ఇలా చెప్పుకొంటే పోతే సీతారామశాస్త్రి పాటల అక్షయ పాత్ర లో అమూల్యమైన ఆణిముత్యాలు, వజ్రాలు ఎన్నో ఉన్నాయి.

సీతారామశాస్త్రి పాటను శ్రోతలు ఎంత అక్కున చేర్చుకున్నారో, అదే స్థాయిలో అవార్డులు సైతం పరుగున వచ్చి ఆయన పాటను ఆదరించాయి. రాసిన తొలి పాట ‘విధాత తలపున’కే నంది అవార్డు దక్కించుకున్న ఘనత సీతారామశాస్త్రిది. అలా మొత్తం 11సార్లు ఆయన నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా నాలుగు సార్లు ఫిల్మ్‌ ఫేర్‌ అందుకున్నారు. ఇక మిగిలిన పురస్కారాలకు, సత్కారాలకు లెక్కేలేదు. ‘కంచె’ చిత్రానికి గానూ ఉత్తమ గేయ రచయితగా సైమా అవార్డు సొంత చేసుకున్నారు.