కరోనాను ఎదుర్కొనే విషయంలో అనేక చర్చలు ఇప్పటికే జరిగిన సంగతి అందరికి తెలిసిందే! ఒకానొక సమయంలో ఆ చర్చల్లో ముఖ్యంగా ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ప్రముఖుడుగా నిలిచాడు. ఇప్పుడు మళ్ళీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కి కూడా మందు తయారు చేసినట్టు ఆయన ప్రకటించడం చర్చనీయాంశమయ్యింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నానికి రావడం, స్థానికులు మందు పంపిణీని అడ్డుకోవడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.. దీంతో ఇప్పుడు ఆనందయ్యకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అవేంటంటే.. తాజాగా ఆనందయ్యకు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ నోటీసులు జారీ చేశారు. కరోనా మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఉన్నాయో తెలపాలని ఆదేశిస్తూ అనుమతులు లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించిన ఆయన.. వారంలోగా పూర్తి సమాచారంతో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ తరుణంలో గ్రామంలో కూడా కృష్ణపట్నం గ్రామ పంచాయతీ అత్యవసరంగా సమావేశం నిర్వహించి ఆనందయ్యకు వ్యతిరేకంగా కృష్ణపట్నం గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తూ కరోనా మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేసింది.

తన మందు కోసం ప్రజలు ఎందుకు వస్తున్నారో ప్రజలనే అడగాలని, ఇప్పటికే మందు తీసుకున్నవారు ఏం చెబుతున్నారో కూడా తెలుసుకోవాలంటున్నారు ఆనందయ్య. మరి.. ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుందా? లేదా? గతంలో కోర్టుకు ఎక్కినట్టు మరోసారి అలాంటి నిర్ణయం తీసుకుంటారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.