ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న వేళ న్యూ ఇయర్‌ వేడుకల విషయంలో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మార్గదర్శకాలు జారీ చేస్తూ ఆంక్షలు విధించారు. అవేంటంటే.. అర్ధరాత్రి 12 వరకూ మద్యం దుకాణాలు, అర్ధరాత్రి ఒంటిగంట వరకూ బార్లు, పబ్బుల్లో మద్యం సరఫరా ఉంటుందని నిన్న ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇటీవల కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్‌మస్‌, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం పట్టించుకోలేదని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ఇవాళ సీజే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టేందుకు పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈనేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌ సీపీ మార్గదర్శకాలు జారీ చేశారు. పబ్బులు, హోటళ్లు, క్లబ్‌లు మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించారు.

న్యూ ఇయర్‌ వేడుకలకు పాటించవలసిన నిబంధనలు ఏంటంటే..

వేడుకల్లో మాస్క్‌ లేకపోతే రూ.వెయ్యి జరిమానా విధించబడుతుంది. రెండు డోసుల టీకా తీసుకున్న వారికే వేడుకలకు అనుమతి ఉంటుంది. వేడుకల్లో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. వేడుకలకు రెండ్రోజుల ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. సిబ్బందికి 48గంటల ముందు కొవిడ్‌ పరీక్షలు చేయాలి. బహిరంగ వేడుకల్లో డీజేకు అనుమతి లేదు. ధ్వని కాలుష్యంపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకోబడును. మద్యం సేవించి వాహనం నడిపితే 6 నెలల జైలు, రూ.10వేల జరిమానా విధించబడుతుంది. అసభ్యకర దుస్తులు ధరించినా, నృత్యాలు చేసినా చర్యలు తీసుకోబడతాయి. వేడుకల్లో మాదక ద్రవ్యాలకు అనుమతిస్తే చర్యలు తీసుకోబడతాయి. విస్తృతంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తాం. మహిళలపై వేధింపులను అరికట్టడానికి షీ బృందాలు, పోలీసులతో నిఘా ఏర్పాటు చేయనున్నట్టు సీపీ ఆనంద్‌ వెల్లడించారు.