హైదరాబాద్‌లో వాహనం నడిపే చాలామందికి ట్రాఫిక్ నిబంధనలు తెలియవు. దీంతో వాళ్లు ఎలా పడితే అలా వాహనాన్ని నడిపేస్తుంటారు. రోడ్డు బాగుంది కదా అని 80 లేదా 100 కిలోమీటర్ల స్పీడ్‌లో వెళ్తుంటారు. కాకపోతే హైదరాబాద్‌ సిటీలో ఎంవీ యాక్ట్ ప్రకారం బైకర్లు గంటకు 60 కి.మీ. స్పీడ్‌తో మాత్రమే వెళ్లాలి. అయితే గత ఏడాది లంగర్‌హౌస్‌కు చెందిన ఓ బైకర్ 66 కి.మీ. వేగంతో వెళ్లడంతో ట్రాఫిక్ పోలీసులు రూ.వెయ్యి ఛలానా విధించారు. దీంతో సదరు వాహనదారుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించగా హైదరాబాద్ నగరంలో కేవలం 40 కి.మీ. వేగంతో మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్‌లు ఎంవీ యాక్ట్‌ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్‌లో సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ స్పందిస్తూ అన్యాయంగా స్పీడ్ లిమిట్ పేరుతో ఛలాన్లు విధించడం సరికాదని హితవు పలికారు. ఎంవీ యాక్ట్ ప్రకారం సిటీలో 60 కి.మీ. స్పీడ్‌తో వెళ్లవచ్చని ఉంది కానీ ఒకవేళ ఆ స్పీడ్‌ను తగ్గించినట్లయితే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని, అంతేకానీ ఇష్టం వచ్చినట్లు ఛలాన్‌లు వేయడం సరికాదన్నారు.