విశాఖ వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రజలకు ఒక చల్లని కబురు చెప్పారు. బుధవారం ఉదయం నుంచే మండుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఉక్కబోతకు గురవుతున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకే 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో చిరు జల్లుల కోసం విశాఖవాసులు ఎదురుచూస్తున్నారు.

వాయవ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.