వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్‌కు చెందిన రాయిపల్లి నర్సింహులు(32) మంగళవారం మధ్యాహ్నం ఎల్లమ్మ ఆలయ సమీపంలోని బావిలో దూకి ఆత్యహత్యకు పాల్పడ్డ విషయాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బావిలోకి దిగి మృతదేహాన్ని గాలించేందుకు స్థానికులు ముందుకు రాలేదు. పోలీసు సిబ్బంది సైతం వెనకడుగు వేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ వెంటనే బావి వద్దకు చేరుకొని ఏడుకొండలు బృందం బావిలోంచి మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎస్‌ఐ ఏడుకొండలు ముందుకొచ్చి తాళ్ల సాయంతో చేద బావిలోకి దిగి చీకట్లోనే నీళ్లలోకి వెళ్లి గాలించి కొన్ని నిమిషాల వ్యవధిలో మృతదేహాన్ని గుర్తించి అనంతరం తాళ్ల ద్వారా మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీసుకురాగలిగారు. ఎస్‌ఐ స్వయంగా బావిలోకి దిగి గాలింపు చర్యలతో మృతదేహాన్ని వెలికితీయడంతో అక్కడే ఉన్న గ్రామస్థులు చప్పట్ల ద్వారా అభినందించారు.