ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిపుణుల బృందం అసలు కరోనా వైరస్ ఎలా పుట్టిందో తెలుసుకోవడానికి కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాకు వెళ్లి మరీ పరిశోధించింది. ఆ పరిశోధనల్లో భాగంగా చాలా ప్రశ్నలకు సమాధానాలు లభించాయి కానీ ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం….

మొదట కరోనావైరస్ కేసులు చైనాలోని వుహాన్‌ నగరంలోనే బయటపడ్డాయనే సంగతి పాఠకులకు విదితమే! అప్పట్లో అక్కడున్న ఓ వన్యప్రాణుల మార్కెట్ నుంచే వైరస్ వ్యాపించిందని కూడా చాలా కథనాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే డబ్ల్యూహెచ్ఓ నివేదిక వైరస్ వ్యాప్తిలో ఈ మార్కెట్ పాత్రపై ఇంకా ఎలాంటి నిర్ధారణకూ రాలేదు.

రెండోది వుహాన్ మార్కెట్‌కు 20కిపైగా దేశాల్లో ఉన్న వన్యప్రాణుల ఫామ్‌ల నుంచి జంతువులు వస్తాయి. గబ్బిలాల్లో కరోనావైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని ఏదో ఒక ఫామ్‌లోని జంతువులకు వైరస్ సోకి అలా అది వుహాన్‌కి వచ్చి ఉండొచ్చన్న వాదనలు కూడా ఉన్నా కానీ, దీన్ని నిరూపించాలంటే మరింత లోతైన అధ్యయనం జరపాల్సి ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ నివేదిక అభిప్రాయపడింది.

మూడోది మనుషుల్లో కరోనా మొదటిసారి బయటపడానికి కొన్ని వారాల ముందు నుంచే ఈ వైరస్ వ్యాపిస్తూ ఉండొచ్చనిఈ నివేదిక సూచించింది. పలు దేశాలు ప్రచురించిన అనేక అధ్యయనాలను ఈ బృందం అధ్యయనం చేసింది. ముందు నుంచే వైరస్ వ్యాప్తిలో ఉందనే సంకేతాలు వాటిలో ఉన్నాయని, వూహాన్‌లో మొదటి కరోనా కేసు నమోదు కావడానికి ముందే కోవిడ్ పాజిటివ్‌గా వచ్చే అవకాశాలున్న పలు శాంపిల్స్ బయటపడడం బట్టి చూస్తుంటే వూహాన్ కంటే ముందే ఇతర దేశాల్లో ఈ వైరస్ వ్యాపిస్తోందని అనుమానాలు వస్తున్నాయని కూడా ఈ నివేదిక అభిప్రాయపడింది. అయితే, ఆ నివేదికల నాణ్యత పరిమితమేనని కూడా ఈ టీమ్ చెప్పుకొచ్చింది. కానీ తొలి కేసు ఎక్కడ మొదలైందో దర్యాప్తు చేయడం అవసరమని కూడా సూచించింది.

చైనాలో మరియు బయటా కూడా తాము రాజకీయ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని,
కానీ ఏదైనా అంశాన్ని తమ నివేదిక నుంచి తొలగించాలంటూ చైనా తమను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని డబ్ల్యూహెచ్ఓ పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన పీటర్ బెన్ ఎంబారెక్ మంగళవారం అన్నారు.

అయితే డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదికపై అమెరికా, బ్రిటన్ సహా 14 దేశాలు స్పందిస్తూ
డబ్ల్యూహెచ్ఓ నిపుణులను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని చైనాను కోరుతూ ‘‘పూర్తి, అసలైన సమాచారం, శాంపిళ్లు ఈ అధ్యయనంలో లోపించాయనీ, తీవ్ర జాప్యం కూడా జరిగిందనీ, శాస్త్రీయ అధ్యయనాలు చేస్తున్న శాస్త్రవేత్తలను ఎలాంటి ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేసుకోనివ్వడం అవసరం. అప్పుడే నిజాలు బయటికొస్తాయి’’ అని ఆ 14 దేశాలు వ్యాఖ్యానించాయి.