ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

మహారాష్ట్ర నుంచి 10 రాబందులు.. !!

ప్రకృతిలో ఎన్నో పక్షి, జంతు జాతులు అంతరిస్తుండడంతో పర్యావరణ మార్పులతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో రాబందుల సంఖ్య కూడా భారీగా తగ్గుతున్నట్టు తెలుస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కనీసం తక్కువ సంఖ్యలో అయినా రాబందుల సంతతి ఉండగా తెలంగాణ రాష్ట్రం లో ఒక్కటంటే ఒక్క రాబందు కూడా లేదని గణాంకాలు చెబుతున్నాయి. పర్యావరణంలో కీలక పాత్ర పోషించే రాబందుల సంఖ్య తగ్గడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించి మహారాష్ట్ర నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఐదు ఆడ, ఐదు మగ కలిపి మొత్తం 10 రాబంధులు ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది.

రాబందులను ప్రత్యేక జాగ్రత్తలతో సంరక్షించి వాటి సంతతి పెంచాలని తెలంగాణ అటవీశాఖ భావిస్తోంది. తెలంగాణలో ఉన్న రాబందుల ఏకైక స్థావరం ఆసిఫాబాద్‌ అడవుల్లోని పాలరావుగుట్ట. కానీ అక్కడ కూడా ఏడాది నుంచి ఒక్క రాబందు కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూ పార్కులో 14 రాబందులు ఉన్నా కూడా అవన్నీ వృద్ధాప్యంలో ఉన్నాయి. అంటే వాటి వయసు 30 నుంచి 35 ఏళ్ల వరకు ఉంటుంది. సాధారణంగా రాబందుల సంతానోత్పత్తి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. కానీ ఇప్పుడున్న రాబంధులకు వయసు మీద పడడంతో సంతానోత్పత్తి చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చే రాబందులతో సంతానోత్పత్తి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

సెంట్రల్‌ జూ అథారిటీ నుంచి అనుమతి రాగానే వాటిని తెలంగాణకు తీసుకువచ్చి వాటి సంతానోత్పత్తి అనంతరం, జూపార్కులో రాబందుల సంఖ్యను 50కి పెంచాలని అధికారులు యోచిస్తున్నారు. ఆ తర్వాత కొన్నింటిని తీసుకెళ్లి ఆసిఫాబాద్‌ అటవీ ప్రాంతాల్లో వదలిపెట్టాలని తెలంగాణ అటవీశాఖ భావిస్తోంది. జంతువుల మృత కళేబరాలను తినే రాబందులు.. ఆ కళేబరాలు కుళ్లిపోవడం వల్ల మనుషులకు వ్యాధులు ప్రబలకుండా చూసేవి. ఐతే డైక్లోఫెనాక్‌ ఇంజెక్షన్లు ఇచ్చిన పశువుల మృత కళేబరాలను తినడం వల్లే దేశంలో రాబందులు అంతరించిపోతున్నాయి. పశువులు తినే ఆహారంలో పురుగు మందుల ప్రభావం ఎక్కువై వాటికి వచ్చిన వ్యాధులు కూడా రాబందులపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా పర్యావరణ మార్పులు, ఆవాసాలు తగ్గిపోవడం, ఆహారం దొరక్కపోవడం వల్ల ఇవి అంతరించిపోతున్నాయి. ఈ క్రమంలోనే రాబందుల సంఖ్యను పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    117
    Shares
  • 117
  •  
  •  
  •  
  •