టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

16ఏళ్ళుగా ఇడ్లీ ధర రూపాయే.. గోదారి జిల్లానా.. మజాకా??

పెరుగుతున్న ధరలతో హోటల్స్ లో ఆహార పదార్ధాల ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. చిన్నచిన్న హోటల్స్ లో ప్లేట్ ఇడ్లీ తినాలంటే కనీసం 20 రూపాయలు కావాలి. అదే పెద్ద హోటల్స్ లో అయితే ప్లేట్ ఇడ్లీ ధర 50 రూపాయల నుండి 70రూపాయల వరకు ఉంటుంది. కానీ తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలోని ఓ హోటల్ లో 16ఏళ్ళుగా రూపాయికే ఇడ్లీ విక్రయిస్తున్నారు. ఇదే ధరకు ఆయన విక్రయిస్తుండటంతో ప్రస్తుతం ఆ హోటల్ ఈ ప్రాంతంలో పాపులర్ గా మారింది.

ఆ హోటల్ కథా కమామీషు ఏంటో చూద్దామా! రాయభూపాలపట్నానికి చెందిన చిన రాంబాబు 16 సంవత్సరాలుగా ఇంటి వద్దనే హోటల్ నిర్వహిస్తూ ఇడ్లీ, మైసూర్ బోండా ధర రూపాయిగానే విక్రయిస్తున్నారు. ఊర్లోని ఇతర హోటల్స్ అన్నింట్లో తొలుత రూపాయికే ఇడ్లీ ఇచ్చేవారు. అయితే క్రమేపి సరుకుల ధరలు పెరగటంతో మిగిలిన హోటల్స్ ఇడ్లీ ధరలను పెంచేశారు. అయితే రాంబాబు మాత్రం రూపాయికే ఇడ్లీని ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు.

రాంబాబు హోటల్ కెళితే పదిరూపాయల్లో కడుపునిండా ఇడ్లీలు తినవచ్చు. దీంతో కస్టమర్లతో నిత్యం రాంబాబు హోటల్ కిటకిటలాడుతూ ఉంటుంది. ఇడ్లీ ధర తక్కువైన క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడరు. రొటీన్ కు భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతోనే తాను తక్కువ ధరకే ఇడ్లీ, బోండం అమ్ముతున్నట్లు చెబుతున్నాడు రాంబాబు. ఇంట్లోనే హోటల్ నిర్వహిస్తుండటంతో అద్దెకట్టే పనిలేదని, తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో విక్రయిస్తున్నందున పెద్దగా లాభాలు లేకపోయినా నడిపిస్తున్నట్లు చెబుతున్నాడు.

హోటల్ నిర్వాహణలో కుటుంబసభ్యుల సహాకారం అందిస్తున్నారు. రాంబాబు, భార్య, అత్తగారు రాంబాబుకు హోటల్ నిర్వాహణలో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అందుకే పనివాళ్ళతో పనిలేదు. గ్రామస్తులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల వారు సైతం రాంబాబు హోటల్ నుండి టిఫెన్ తీసుకు వెళ్ళేందుకు వస్తుంటారు. ఉదయం 5గంటల నుండి 10గంటల వరకు క్షణం తీరిక లేకుండా హోటల్ కార్యక్రమాల్లో రాంబాబుతోపాటు, కుటుంబసభ్యులు బిజీబిజీగా గడుపుతారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •