మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న కారణంగా ముంబైలో 144 సెక్షన్ విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ కేసులను నియంత్రించేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 30 నుంచి జనవరి 7 వరకు ముంబైలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు.

ఈ క్రమంలో డిసెంబర్ 30 అర్ధరాత్రి 12 గంటల నుంచి 2022 జనవరి 7 వరకు గ్రేటర్ ముంబై పరిధిలోని రెస్టారెంట్లు, హోటళ్లు, బార్లు, పబ్‌లు, రిసార్టులు, క్లబ్‌లు సహా అనేక బహిరంగ ప్రదేశాల్లో న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా నిబంధలను ఉల్లంఘిస్తే అంటువ్యాధుల చట్టం 1897, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం చట్టపరమైన నిబంధనలతో పాటు భారతీయ శిక్షాస్మృతి 180 ప్రకారం శిక్షార్హులు అవుతారని పోలీసులు స్పష్టం చేశారు.