దక్షిణాఫ్రికాలో సెంచురియాన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 191 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (123) శతకంతో చెలరేగాడు. మిగిలిన రెండు టెస్టుల్లో టీమ్‌ఇండియా ఒక్క దాంట్లో గెలిచినా సిరీస్‌ని కైవసం చేసుకుని దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌ ముగిసిన అనంతరం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, సౌతాఫ్రికా సారథి ఎల్గర్ మాట్లాడారు.

ఈ పర్యటనలో వర్షం కారణంగా ఒక రోజు ఆట (రెండో రోజు) పూర్తిగా కోల్పోయినా మేము చాలా బాగా ఆడాం. సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో ఆడటం ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుంది. విదేశాల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం అనేది సవాలుతో కూడుకున్నది. తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు సాధించడానికి మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ లను ముఖ్య కారణంగా చెప్పవచ్చు. బౌలర్లు రాణిస్తారని మాకు తెలుసు. అయితే క్లిష్ట పరిస్థితుల్లో మా బౌలర్లు సమష్టిగా బౌలింగ్ చేయడంతో జట్టు ఈ ఫలితాన్ని పొందింది. షమి కచ్చితంగా అద్భుతమైన, ప్రపంచస్థాయి బౌలర్‌. ప్రస్తుతం ప్రపంచంలోని ముగ్గురు అత్యుత్తమ పేసర్లలో అతడు ఒకడు’ అని విరాట్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎల్గర్‌ మాట్లాడుతూ తొలి మ్యాచ్ లో కొన్ని తప్పులు చేయడం వల్లే మేము ఓడిపోయాము. భారత ఓపెనర్లు రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేశాం. 20 వికెట్లు తీయడానికి మా బౌలర్లు పడిన కష్టాన్ని చెప్పలేం. మా బ్యాటర్లు నిరాశపరిచారు. రెండు జట్ల మధ్య బ్యాటింగ్‌లో తేడా ఉంది. ఇదే విషయం పై జట్టు యాజమాన్యంతో మాట్లాడితే బావుంటుంది అని ఎల్గర్‌ వివరించారు.